: వ్యవసాయానికి బడ్జెట్టా?...అలాంటి ఆలోచనే లేదు!: కేంద్రం స్పష్టీకరణ
వ్యవసాయానికి ప్రత్యేకబడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టాలని వస్తున్న డిమాండ్ ను కేంద్రం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ, వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనేదీ తమ పరిశీలనలో లేదని అన్నారు. అయితే 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. దీనిపై మంత్రుల బృందం పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని, ఈ నివేదిక సెప్టెంబర్ నాటికి తమకు అందుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది దేశంలో 363 మంది రైతులు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సభకు తెలిపారు.