: ఆ మూడు రోజులు తీవ్ర మానసిక వేదన అనుభవించాను: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పించడంపై అన్ని పార్టీలు తనను దోషిని చేశాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గద్గద స్వరంతో అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, విభజన బిల్లు ఆమోద సమయంలో ఆ మూడు రోజులు తీవ్ర మానసిక వేదన అనుభవించానని చెప్పారు. కలసి కలహించుకోవడం కన్నా విడిపోయి కలసి ఉండడం మిన్న అని తాను అప్పట్లో అన్నానని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విభజన చిచ్చు రేగిందని అన్నారు. అన్ని పార్టీల ఆమోదంతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ప్రయత్నించలేదని ఆ రోజే తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. దాంతో ఆ రోజే పలు పరిష్కారాలు చూపించానని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే, ఏపీ భవిష్యత్ తరాల అవసరాలను గుర్తించాలని కోరానని ఆయన చెప్పారు. విభజన బిల్లు ఆమోదం పొందగానే వివిధ పార్టీలు ప్రత్యేకహోదా కావాలంటూ లేఖలు రాశాయని ఆయన తెలిపారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని బిల్లులో దానిని కూడా జత చేయండని అడిగానని ఆయన గుర్తుచేశారు. అది బిల్లులో జత చేస్తే... బిల్లును తిరిగి లోక్ సభకు పంపాల్సి వస్తుందని తనతో చెప్పడం వాస్తవం కాదా? అని ఆయన అడిగారు. ఆ రోజు బిల్లులో ఏపీకి ప్రత్యేకహోదా జతచేయలేదని ఆయన స్పష్టం చేశారు. అదంతా మర్చిపోయి... ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన తెలిపారు. విభజన జరిగిన రెండేళ్ల తరువాత కూడా పలు సమస్యలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు. తాను తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినన్న కారణంతో, జన్మభూమికి సేవ చేయాలన్న ఆలోచనతో విభజన సమస్యలు పరిష్కరించడంలో చొరవ తీసుకున్నానని ఆయన తెలిపారు. ఇప్పటికీ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ లో ఉందో? లేక తెలంగాణలో ఉందో? చాలామందికి తెలియదని, ఇప్పటికీ ఏపీలోని హైదరాబాదుకు వెళ్లామని కొందరు అంటుంటారని ఆయన పేర్కొన్నారు. ఏపీ సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధిగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీలో విద్యాలయాలు నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. తనకు వైజాగ్ తో అనుబంధం ఉందని.. తాను వైజాగ్ లోనే చదువుకున్నానని ఆయన మరోసారి వైజాగ్ పై ప్రత్యేక అభిమానం వ్యక్తం చేశారు.