: ఈ మూడున్నరేళ్లలో ఇంతటి దారుణమైన కేసును చూళ్లేదు: విచారణ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్య
'గత మూడున్నరేళ్లగా ఈ బెంచ్ లో కేసులు విచారిస్తున్నాను. కానీ ఇంత దారుణమైన కేసును ఎప్పుడూ చూళ్లేదు' అని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని హామిల్టన్ కౌంటీ కోర్టు జడ్జి లెస్లీ ఘిజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ జడ్జి ఆవేదన వ్యక్తం చేసిన ఆ కేసు వివరాల్లోకి వెళ్తే... కొర్కొరన్ అనే మహిళ డ‍్రగ్స్ కు బానిసైంది. నిత్యం మత్తులో తూగే కొర్కొరన్ కు హెరాయిన్ తీసుకోకుండా రోజు గడిచేది కాదు. నిత్యం మత్తులో జోగే ఆమెకు ఆదాయవనరు లేకపోవడంతో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు తన పదకొండేళ్ల కుమార్తెను రెండేళ్ల క్రితం డ్రగ్ డీలర్ షాండెల్ విల్లింగామ్ వద్ద కుదువపెట్టింది. అంతటితో ఆగని ఆ తల్లి ముక్కుపచ్చలారని కుమార్తెపై అత్యాచారం చేసేందుకు కూడా అతనికి అనుమతిచ్చింది. దీంతో ఆ దుర్మార్గుడు అభంశుభం తెలియని బాలికను చెరచడమే కాకుండా... ఆ దారుణాన్ని వీడియో తీసేవాడు. ఇలాంటి సందర్భాల్లో ఆ పసి బాలికకు డ్రగ్స్ ఇచ్చేవారు. ఇలా డ్రగ్స్ ఇచ్చిన ప్రతిసారీ బాలిక వాంతులు చేసుకునేది. అయినప్పటికీ వారు వదల్లేదు. ఐదునెలల పాటు బాలికపై దారుణానికి తెగబడ్డారు. ఈ దుర్మార్గుల పాపం పండడంతో దారుణం వెలుగు చూసింది. దీంతో కొర్కొరన్, డ్రగ్ డీలర్ షాండెల్ విల్లింగామ్ పై కేసు నమోదు చేసి విచారణ జరపగా, న్యాయస్థానం ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది. కొర్కొరన్ కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ సమయంలో ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి పేర్కోవడం విశేషం. కాగా, ఈ కేసులో షాండెల్ కు శిక్ష విధించాల్సిఉంది.