: మాయ మాటలు చెప్పి తన హీరోయిన్ తో సుద్ద ముక్కను తినిపించిన హృతిక్ రోషన్!
తన తాజా చిత్రం 'మొహంజోదారో' షూటింగ్ సమయాన హీరోయిన్ పూజా హెగ్డేతో సుద్ద ముక్కను తినిపించాడట హృతిక్ రోషన్. ఆయన తమాషా తనకు నచ్చిందని చెబుతూనే, తాను అమాయకంగా ఎలా మోసపోయిందీ వెల్లడిస్తోందీ అందాల ముద్దుగుమ్మ. లొకేషన్లో ప్రాక్టికల్ జోకులు వేస్తూ అందరినీ ఆటపట్టించే హృతిక్, ఓ సుద్ద ముక్కను తెచ్చి, అది ప్రొటీన్ బార్ అని, దీన్ని తింటే శరీరానికి శక్తి వస్తుందని చెప్పాడట. అనుమానం వచ్చి ప్రశ్నిస్తే, "ఆరోగ్యాన్ని ఇచ్చే వేవీ ఆకర్షణీయంగా ఉండవు. చేటు చేసేవే నోరూరిస్తూ కమ్మగా ఉంటాయి. ప్రొటీన్ బార్ రుచిగా ఉండదులే" అని నమ్మించాడట. హృతిక్ మాటలు పూర్తిగా నమ్మిన పూజా, ఆ సుద్ద ముక్కను తినేసింది. ఆపై విషయం తెలుసుకుని బుంగమూతి పెట్టింది. హృతిక్ మాటలకు మోసపోయానని, ఏదేమైనా ఇదో తమాషా ఘటనని చెప్పుకుంటోంది.