: 'ఆదిత్యా 369-2' స్క్రిప్టు రెడీగా ఉంది... మోక్షజ్ఞ అరంగేట్రానికి కూడా స్కోప్ ఉంది: సింగీతం శ్రీనివాసరావు
'ఆదిత్యా 369' సీక్వెల్ ను తీసేందుకు కథ సిద్ధంగా ఉందని ఆ సినిమా డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. గతంలో సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన 'ఆదిత్యా 369' టాలీవుడ్ లో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన మూల కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో సినిమాలకు ఆదర్శంగా నిలిచింది. విఠలాచార్య సినిమాలలో మాత్రమే సాంకేతికతను చూసిన తెలుగు ప్రేక్షకులకు సింగీతం శ్రీనివాసరావు సరికొత్త సాంకేతిక అనుభూతిని అందజేశారు. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ రాసుకున్నానని సింగీతం చెప్పారు. దానిలో కూడా బాలయ్య మాత్రమే నటించాలని అన్నారు. బాలయ్య ఎప్పుడు సరే అంటే అప్పుడు షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఈ సినిమా ద్వారా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే విధంగా కథను సిద్ధం చేశానని ఆయన చెప్పారు. తన కథ ఎప్పుడు విడుదలైనా ఫ్రెష్ అనుభూతినిస్తుందని ఆయన చెప్పారు.