: పోలీసుల స్పందనలో ఏ మాత్రం ఆలస్యమైనా... బాస్టిల్ వేడుక శవాల గుట్టగా మారేదే!
ఫ్రాన్స్ నగరం నీస్ లో జరిగిన ఉగ్రదాడి తీరు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఒక్కడుగానే ఎంటరైన ఉగ్రవాది 75 మందిని క్షణాల్లో చంపేశాడు. సుమారు వంద మందిని గాయాల పాలు చేశాడు. అప్పటిదాకా కేరింతలతో కోలాహలంగా కనిపించిన బాస్టిల్ ఉత్సవాల ప్రదేశం... ఆ దుర్మార్గుడి భీకర దాడితో హాహాకారాలతో మారుమోగింది. పేలుడు పదార్థాలు నింపుకున్న ట్రక్కుతో జనంపైకి దూసుకువచ్చిన అతడు దాదాపు 2 కిలో మీటర్ల మేర జనాన్ని తొక్కించుకుంటూ ముందుకు సాగాడు. ఆ తర్వాత ముందుగానే నిర్దేశించుకున్న ప్రాంతంలో వాహనాన్ని ఆపేసి రెస్టారెంటులోకి చొరబడ్డాడు. ఈ సమయంలో పోలీసుల స్పందనలో ఏమాత్రం ఆలస్యం జరిగినా బాస్టిల్ ఉత్సవాల ప్రదేశం శవాల గుట్టగా మారేదే. ప్యారిస్ దాడి నేపథ్యంలో ఒళ్లంతా కళ్లు చేసుకుని నిఘా వేసిన పోలీసులు ట్రక్కు జనంపైకి దూసుకొచ్చిన వెంటనే అప్రమత్తమయ్యారు. ట్రక్కు ఆగీ ఆగగానే ఉగ్రవాది వాహనం దిగి పరుగున వెళ్లి దాక్కున్న రెస్టారెంటును పోలీసులు చుట్టుముట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెస్టారెంటులోకి వెళ్లగానే బాంబులతో నిండిన ట్రక్కును పేల్చేందుకు ఉగ్రవాది ప్రణాళిక రచించుకున్నాడు. ఈ ప్రణాళికను అతడు అమలు చేసేలోగానే స్పందించిన పోలీసులు రెస్టారెంట్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ బుల్లెట్లు రెస్టారెంట్ గోడలతో పాటు ఉగ్రవాది శరీరాన్ని ఛిద్రం చేశాయి. దీంతో సదరు ఉగ్రవాది చనిపోయాడు. పోలీసుల బుల్లెట్ల వర్షం కురవడంలో ఏమాత్రం జాప్యం జరిగినా... ఆ ఉగ్రవాది బాంబులతో జనం మధ్య ఉన్న ట్రక్కును పేల్చేసేవాడే. ఇదే జరిగి ఉంటే... రోడ్డుపై ఉన్న జనం జీవశ్చవాలుగా మారేవారు. ఆ ప్రాంతం శవాల గుట్టగా మారేది. అయితే తాము సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.