: అందాల తార హన్సికలో మానవీయత!
వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అందాల భామ హన్సిక సమాజ సేవలో కూడా ముందే ఉంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నిరాశ్రయులకు మౌలిక అవసరాలను కల్పించమంటూ ఒక ట్వీట్ చేసింది. ఇతరులకు సహాయపడమని.. వర్షాకాలంలో వారికి కనీస అవసరాలను అందించాలని, మనం చేయగలిగిన చిన్న పని ఇదేనని... అంటూ ఆమె ఆ ట్వీట్ లో పేర్కొంది. అంతేకాదు, ముందుగా దీనిని తనే ఆచరించి చూపింది. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారి వద్దకు హన్సిక స్వయంగా వెళ్లి వారిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, దుప్పట్లు, బట్టలు, ఇతర సామాగ్రిని అక్కడ ఉంచి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను హన్సిక అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో, ఇది వైరల్ గా మారింది. కాగా, కొందరు పేద బాలలను దత్తత తీసుకుని వారి మంచి చెడ్డలు చూడటంతో పాటు, పెయింటింగ్ లు వేస్తూ తద్వారా వచ్చే డబ్బును సేవా కార్యక్రమాలకు హన్సిక వినియోగిస్తున్న విషయం తెలిసిందే.