: అమెరికాకు వెళ్లే వారు జాగ్రత్త... మూడు దేశాల అసాధారణ హెచ్చరికలు


సాధారణంగా గొడవలు, అల్లర్లు జరుగుతున్న దేశాలకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు దేశాలు హెచ్చరికలు జారీ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. కానీ, అభివృద్ధి చెందిన అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లేవారిపట్ల ఎలాంటి హెచ్చరికలూ ఉండవు. కానీ, అమెరికాలోని అసాధారణ పరిస్థితులు మూడు దేశాల ప్రభుత్వాలను, తమ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసేలా చేశాయి. యూఎస్ లో పర్యటనకు వెళుతుంటే జాగ్రత్తగా ఉండాలని బెహరైన్, బహమాస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ జాతీయులను హెచ్చరించాయి. అమెరికాపై ఇలా మూడు దేశాలు హెచ్చరించడం ఇదే మొదటిసారి. అమెరికాలో జాతి విద్వేషాలు పెరగడం, నల్లజాతి వారిపై వరుస కాల్పుల ఘటనలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మధ్య ప్రాచ్యంలో ద్వీపదేశం బెహరైన్, తన పౌరులు అమెరికాకు వెళితే, జాగ్రత్తగా ఉండాలని, గొడవలు, అధిక జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. ఇదే సమయంలో కరేబియన్ దేశంగా ఉన్న బహమాస్ సైతం ఇదే హెచ్చరికలు విడుదల చేసింది. ముఖ్యంగా నల్లజాతి పురుషులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం తమ పౌరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అమెరికాలో పర్యటిస్తుంటే సంప్రదాయ దుస్తులను వీడి అమెరికాకు సరిపడే దుస్తులు ధరించాలని సూచించింది. కాగా, ఈనెల ప్రారంభంలో బంగ్లాదేశ్, వెనిజులా, ఇరాక్, మాలి దేశాలకు వెళ్లే అమెరికా పౌరులకు ఒబామా ప్రభుత్వం ట్రావెల్ వార్నింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News