: అపజయాన్ని జీర్ణించుకోలేని ఫ్రాన్స్ సాకర్ ఫ్యాన్స్!... ఈఫిల్ టవర్ వద్ద బీభత్సం!
యూరో కప్ ఫైనల్ పోటీలో ఆతిథ్య దేశం ఫ్రాన్స్ పరాజయం పాలైంది. నిన్న రాత్రి పారిస్ లో ఉత్కంఠభరింతంగా సాగిన టైటిల్ పోరులో పటిష్ట జట్టుగా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ను పోర్చుగల్ చిత్తు చేసింది. చివరి నిమిషం దాకా నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో 109వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు ఎడెన్ చేసిన ఒకే ఒక్క గోల్ ఫ్రాన్స్ ను రన్నరప్ గా నిలిపింది. ఫలితం తేలేంత దాకా సంయమనంగానే ఉన్న ఫ్యాన్స్ మ్యాచ్ ముగియగానే ఒక్కసారిగా కట్టు తప్పారు. విజయంతో పోర్చుగల్ అభిమానులు సంబరాల్లో మునిగిపోగా... పరాభవంతో కన్నీళ్ల పర్యంతమైన ఫ్రాన్స్ అభిమానులు విధ్వంసానికి దిగారు. ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ఈఫిల్ టవర్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ తో ఆందోళనకారులను నిలువరించారు. ఆ తర్వాత విధ్వంసానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 40 మందిని అదుపులోకి తీసుకున్నారు.