: స్వామి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో చైనా పర్యటన నుంచి అర్థాంతరంగా తిరిగొచ్చిన జైట్లీ!


ఓ వైపు స్వదేశంలో సొంత పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదురవుతున్న వేళ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన చైనా పర్యటనను రెండు రోజుల ముందే ముగించుకుని ఇండియాకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం 24వ తేదీన చైనాకు వెళ్లిన జైట్లీ, తిరిగి 28వ తేదీన మాత్రమే ఇండియాకు రావాల్సి వుండగా, తన షెడ్యూల్ ను మార్చుకున్న ఆయన, గత రాత్రి ఇండియాకు వచ్చేశారు. సుమారు 100 బిలియన్ డాలర్ల విలువైన ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) బోర్డు గవర్నర్ల సమావేశాల నిమిత్తం చైనాకు వెళ్లిన ఆయన, తన మిగతా సమావేశాలను రీ షెడ్యూల్ చేసుకున్నారు. చైనా ఆర్థికమంత్రి లూ జీవైతో నేడు జరపాల్సిన సమావేశాన్ని నిన్ననే షెడ్యూల్ చేసుకున్నారు. ఆపై నేషనల్ డెవలప్ మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ చైర్మన్ క్సూ షాఓషి, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ జో క్సియోచువాన్ లతోనూ చకచకా సమావేశాలు ముగించి, ఇండియా విమానం ఎక్కేశారు. ఆయన తన ప్రయాణాన్ని కుదించుకోవడంపై కారణాలు వెల్లడి కానప్పటికీ, చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ లను స్వామి తీవ్రంగా విమర్శిస్తుండడమేనని తెలుస్తోంది. తన పేరును వెల్లడించనప్పటికీ, ఆయన చేస్తున్న విమర్శలు తనకే తగులుతుండటంతో, నష్ట నివారణ చర్యల నిమిత్తమే, జైట్లీ రెండు రోజుల ముందుగా ఇండియాకు వచ్చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News