: రవిశాస్త్రికి షాక్... కుంబ్లేకు ఛాన్స్!


టీమిండియా కోచ్ రేసులో రవిశాస్త్రికి బీసీసీఐ షాకివ్వనున్నట్టు తెలుస్తోంది. టీమిండియా డైరెక్టర్ గా సేవలందించిన రవిశాస్త్రి టీమిండియాకు పూర్తి స్థాయి కోచ్ గా సేవలందిస్తానని దరఖాస్తు చేశాడు. అతనితో పాటు 60 మంది టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహం చూపారు. వీరందర్నీ కాదని రాహుల్ ద్రవిడ్ ను టీమిండియా కోచ్ గా నిలిపేందుకు సీనియర్లతో పాటు బీసీసీఐ కూడా శతవిధాల ప్రయత్నించింది. అయితే జట్టులో తనతో పాటు ఆడిన ఆటగాళ్లు ఉండడం కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించడానికి అడ్డంకిగా మారుతుందని భావించిన ద్రవిడ్ అందుకు అంగీకరించలేదు. దీంతో, ఈ రేసులో క్రీడా విశ్లేషకుల అంచనాల ప్రకారం నిన్నటి వరకు రవిశాస్త్రి ముందు ఉండగా, అతని తరువాతి స్థానంలో చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఉన్నాడు. ఆ తరువాత వెంకటేష్ ప్రసాద్... ఇలా పలువురు ఉండగా, ప్రారంభంలో అసలు వార్తల్లో లేని అనిల్ కుంబ్లే అకస్మాత్తుగా ఇప్పుడు తెరమీదికి వచ్చాడు. కుంబ్లే మంచి విశ్లేషకుడన్న సంగతి తెలిసిందే. దిగ్గజ ఆటగాడైన కుంబ్లేకు సాంకేతిక అంశాలమీద మంచి పట్టుంది. ఎలాంటి వివాదాలు అతనితో ముడిపడి లేవు. అదీకాక ఆయన ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆటతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. దీంతో అతనిని రేసులోకి తీసుకొచ్చిన బీసీసీఐ అతని వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కాగా, దూకుడుగా ఉండే రవిశాస్త్రికి ఈ నిర్ణయం శరాఘాతమే. ఆయనతో పాటు ఆయనను నమ్ముకున్న సపోర్టింగ్ స్టాప్ కు కూడా ఇది షాకింగ్ వార్తే... తాజా నిర్ణయంతో విరాట్ కోహ్లీకి కూడా టీమిండియా ఓ చిన్న జర్క్ ఇచ్చింది. ఏదంటే అది దొరకదని, దొరికిన దానితోనే ఉత్తమ ఫలితాలు సాధించాలని పరోక్షంగా స్పష్టం చేసినట్టైంది. అదీ కాక రవి శాస్త్రి కంటే కుంబ్లే మెరుగైన క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేకపోవడంతో టీమిండియా భవిష్యత్ పై బీసీసీఐ ఆశావహంగా ఉన్నట్టు కనపడుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News