: ఫలించిన రతన్ టాటా లాబీయింగ్... విస్తారా, ఎయిర్ ఆసియాలకు బంపరాఫర్!


భారత విమానయాన రంగంలో గత కొంతకాలంగా చర్చనీయాంశమైన 5/20 రూల్ (కనీసం 20 విమానాలతో ఐదేళ్ల పాటు సేవలందిస్తేనే ఇంటర్నేషనల్ రూట్లలో సర్వీసులు నడిపేందుకు అనుమతి)ను తాత్కాలికంగా తొలగించేందుకు నరేంద్ర మోదీ క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో టాటా సంస్థలకు వాటాలున్న విస్తారా, ఎయిర్ ఆసియా వంటి ఎయిర్ లైన్స్ సంస్థలు వెంటనే ఇంటర్నేషనల్ రూట్లలో విమానాలు తిప్పే అవకాశం లభించనుంది. బుధవారం నాడు మారిన పౌర విమానయాన విధానాన్ని కేంద్రం విడుదల చేయగా, ఐదేళ్ల నిబంధనను తొలగిస్తున్నట్టు విమానయాన శాఖ తెలిపింది. ఇదే సమయంలో కనీసం 20 విమానాలు లేదా 20 శాతం విమానాలు (ఏది ఎక్కువైతే అది) దేశవాళీ సెక్టార్ లో నడుపుతుంటే మాత్రమే, విదేశీ సేవలకు అనుమతి లభిస్తుంది. "కొత్తగా ప్రారంభమయ్యే విమానయాన సంస్థలు సులువుగా అభివృద్ధి చెందేందుకు, ఈ రంగంలో పోటీని పెంచి మరింత తక్కువ ధరలకు విమాన టికెట్లు లభించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది" అని విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, ఈ రూల్ ను తీసివేయాలని నరేంద్ర మోదీ వద్ద పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చేసిన లాబీయింగ్ ఫలించిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియాలో తొలి తరం ఎయిర్ లైన్స్ సంస్థను నడిపిన కుటుంబం నుంచి వచ్చిన రతన్ టాటా, విస్తారా, ఎయిర్ ఆసియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ వంటి సంస్థలు 5/20 రూల్ తీసేయాలన్న డిమాండును తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, వారి వాదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News