: 'ఉడ్తా పంజాబ్'కు ఊరట... సింగిల్ కట్ తో సినిమా విడుదలకు ఆదేశం!
గత పదిరోజులుగా బాలీవుడ్ లో కలకలం రేపిన 'ఉడ్తా పంజబ్' సినిమాకు బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. సినిమా యూనిట్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చే అవకాశముందని భావించిన సెన్సార్ బోర్డు ఇప్పటికే దిగివచ్చి, కేవలం 13 కట్ లు, 'ఏ' సర్టిఫికేట్ తో విడుదలకు అనుమతినిచ్చింది. అనంతరం ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు కేవలం ఒకే ఒక్క కట్ తో 'ఏ' సర్టిఫికేట్ తో విడుదలకు అనుమతించింది. దీంతో సినిమా యూనిట్ ఆనందంలో మునిగిపోగా, సెన్సార్ బోర్డు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట పడిందని భావిస్తున్నారు. తాజా తీర్పుతో సెన్సార్ బోర్డు అధికారాలను న్యాయస్థానం ప్రశ్నించినట్టైంది. ఇకపై సినిమాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో క్రియేటివిటీ పేరుతో తీసే సినిమాలు సమాజాన్ని తప్పుదోవపట్టించే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.