: చోటా రాజన్ హత్యకు కుట్ర... నలుగురు గ్యాంగ్ స్టర్ల అరెస్ట్
మాఫియా డాన్ చోటా రాజన్ ను మట్టుబెట్టేందుకు భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం యత్నిస్తూనే ఉన్నాడు. దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఈ మేరకు పక్కాగా రూపొందించిన ప్లాన్ ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. చోటా షకీల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన నలుగురు కాంట్రాక్టు కిల్లర్లను పోలీసులు ఈ నెల 3న అరెస్ట్ చేశారు. దాదాపు ఐదు రోజుల పాటు వారిని విచారించిన పోలీసులు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, వారిని చోటా రాజన్ ఉంటున్న తీహార్ జైలుకే తరలించారు.
వివరాల్లోకెళితే... దావూద్ ఆదేశాలతో రంగంలోకి దిగిన చోటా షకీల్... రాబిన్సన్, జునైద్, యూనస్, మనీష్ అనే నలుగురు కాంట్రాక్టు కిల్లర్లకు చోటా రాజన్ ను చంపేసే బాద్యతను అప్పగించాడు. షకీల్ ఆదేశాలతో ఇప్పటికే ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చేరుకున్న ఈ నలుగురు కిల్లర్లు అదను కోసం మాటు వేశారు. ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి కోర్టుకు తరలించే సమయంలో రాజన్ ను మట్టుబెట్టాలని వీరు భావించారు. ఇందులో భాగంగా వీరు పలుమార్లు ఫోన్లలో సంభాషించుకున్నారు. ఈ ఫోన్ సంభాషణలను పట్టేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఓ పిస్టల్, కాట్రిడ్జ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.