: ప్రజలు తిరగబడక ఏం చేస్తారు..?: ముద్రగడ దీక్ష నేపథ్యంలో చంద్రబాబుపై జగన్ ఫైర్
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలనే కాపునేత ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముద్రగడ దీక్షకు దిగిన సందర్భంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ‘దీక్షలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయని చంద్రబాబు అంటున్నారు.. ముద్రగడ తన ఇంట్లో దీక్ష చేస్తే అది శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు. ‘ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తే ప్రజలు తిరగబడక ఏం చేస్తారు..?’ అని ఆయన దుయ్యబట్టారు.
‘ప్రజలతో పనైపోయాక చంద్రబాబు మోసం చేస్తారు’ అని జగన్ వ్యాఖ్యానించారు. గతంలో కులాల మధ్య కూడా చంద్రబాబు చిచ్చుపెట్టారని అన్నారు. ‘మీరు మోసం చేస్తున్నారు అని ప్రజల అడగడం తప్పా..?’ అని ఆయన ప్రశ్నించారు. సామాజిక సమస్యను రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. శాంతి భద్రతల సమస్యగా చంద్రబాబే ఈ అంశాన్ని మారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నాం’ అని అన్నారు. 'అందరూ ఒక్కటై చంద్రబాబు వైఖరిపై నిరసన తెలపండి' అంటూ పిలుపునిచ్చారు.