: భారత్, అమెరికా మైత్రి ఉన్నత శిఖరాలకు చేరింది: ప్రధాని మోదీ
భారత ప్రజలు ప్రతిక్షణం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా చట్టసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ‘థోరోస్ ప్రతిపాదించిన సహాయ నిరాకరణ మా రాజకీయ తత్వాన్ని మార్చింది. స్వామి వివేకానంద షికాగో ప్రసంగం, భారతీయ సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం.. మార్టిన్ లూథర్ కింగ్ ని ప్రభావితం చేసింది. అంబేద్కర్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది కొలంబియా వర్శిటీలో చదువుకున్న రోజులే. అమెరికా రాజ్యాంగం ఆయన మీద అపార ప్రభావాన్ని చూపించింది. భారత్, అమెరికాలు సహజమిత్రులని నాటి ప్రధాని వాజ్ పేయి అన్న మాట అక్షరసత్యం. బలపడుతూ వచ్చిన భారత్-అమెరికా బంధం ఇవాళ ఉన్నత శిఖరాలకు చేరింది. భారత్ కష్టంలో ఉన్నప్పుడు అమెరికా అందించిన సాయం ఎన్నటికీ మరచిపోము. ముంబయి దాడుల తర్వాత బాసటగా నిలిచిన అమెరికాను భారత జాతి ఎన్నటికీ మర్చిపోదు. భారత్, అమెరికా చట్టసభల మధ్య అనేక పోలికలు ఉన్నాయి. ఏ దేశంతో పోల్చినా భారత్, అమెరికా మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు అత్యంత ప్రభావవంతమైనవి. దశాబ్దకాలంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్యం 10 బిలియన్ డాలర్లకు చేరింది. పౌర అణువిభాగంలో భారత్, అమెరికా మైత్రి కొత్త శిఖరాలకు చేరింది, ధ్రుడతరమవుతోంది. భారతీయ యోగా సంప్రదాయాన్ని అమెరికాలో 30 మిలియన్ల మంది అభ్యసిస్తున్నారు. భారతదేశం యోగా మీద మేధోహక్కులను కోరుకోవడం లేదు. ప్రపంచానికి భారత్ యోగాను అందించినందుకు గర్వపడుతున్నాను’ అన్నారు మోదీ తన ప్రసంగంలో.