: అమెరికాలో రెండేళ్ల పాపను కిడ్నాప్ చేసిన స్కూల్ విద్యార్థినులు!
రెండేళ్ల పాపను స్కూల్ విద్యార్థినులు కిడ్నాప్ చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికా న్యూ క్యాజిల్ సిటీలోని ప్రిమార్క్ స్టోర్లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. రెండేళ్ల పాపతో కలసి ఆ స్టోర్ కు వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడ షాపింగ్ చేస్తూ బిజీ అయిపోయారు. ఇంతలో, స్టోర్‌లో దొంగతనాలు చేయడానికి అలవాటు పడిన ఇద్దరు స్కూలు విద్యార్థినులు పాప ఒంటరిగా కనిపించడంతో ఈసారి ఆ పాపను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి పాపను తీసుకెళ్లారు. ఇద్దరు విద్యార్థినుల వయసు 14 ఏళ్లయినా ఉండవు. తమ పాప కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ పాప కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే స్పందించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు స్కూల్ విద్యార్థులు పాపను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. దీంతో పోలీసులు పాప కిడ్నాపయిన 45 నిమిషాల్లో ఆ పాపను తిరిగి తీసుకొచ్చేశారు. వీరిరువురూ స్టోర్‌లో ఇంతకు ముందు కూడా షూలు, పాలడబ్బాలు దొంగిలించారట. కిడ్నాప్ చేసిన విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. విద్యార్థినుల వయసు 14లోపే ఉండడంతో వారిపై కిడ్నాపేతర అభియోగాల నమోదు కోసం పిటిషన్ దాఖలు చేసి, విచారిస్తున్నారు.