: పర్సనాలిటీ డెవలెప్ మెంట్ అంటే స్వార్ధం: యండమూరి వీరేంద్రనాథ్
పర్సనాలిటీ డెవలెప్ మెంట్ అంటే స్వార్ధమని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, స్వార్ధం అంటే మన ఆనందాన్ని వెతుక్కోవడమని అన్నారు. ఓషో థియరీ అదేనని ఆయన భాష్యం చెప్పారు. తన పుస్తకాలను వివిధ రకాలుగా వర్గీకరిస్తానని ఆయన చెప్పారు. తాను గొప్పగా రాసేస్తే ఇతర రచయితలకు పని ఉండకుండా పోతుందని ఆయన చమత్కరించారు. గొప్పగా ఉండకుండా రాస్తే వారికి కూడా పని దొరుకుతుందని, తాను కూడా మరో పుస్తకం రాసుకోవచ్చని అలా బిజినెస్ పెంచుకోవచ్చని, ఇది బిజినెస్ ట్రిక్ అని, దానిని తాను ఫాలో అవుతున్నానని ఆయన చెప్పారు. ఒకప్పుడు విజయానికి ఐదు మెట్లు ఉండేవని, ఇప్పుడు ఒక్కటే మెట్టు అయిపోయిందని, అదే కంప్యూటర్ అని ఆయన సెటైర్ వేశారు. మీ పిల్లలను కనీసం మూడు రంగాల్లో పెడితే, 16 ఏళ్ల వరకు వాటిల్లోనే వారు మెరుగ్గా రాణిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను స్వేచ్చగా వదిలేస్తే సమాజం సగం బాగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలను పట్టుకుని తల్లిదండ్రులు వేళ్లాడ్డం వల్లే సమాజంలో రుగ్మతలు పేరుకుపోతున్నాయని ఆయన చెప్పారు. తాను నేర్చుకున్న ప్రతి అంశమూ తన తండ్రి నుంచి నేర్చుకున్నానని ఆయన తెలిపారు. సక్సెస్ కు అర్థం ఏంటంటే...ఈ రోజు నవ్వుతూ ఆనందంగా ఉండడమని ఆయన చెప్పారు. అలా చెప్పానని...ఈ రోజు నిండా తినేసి, తాగేసి తూలుతూ అందర్నీ వేధించమని కాదని ఆయన తెలిపారు. ఈ రోజు నవ్వుతూ ఉండడం ఎంత ముఖ్యమో, రేపు కూడా నవ్వుతూ ఉండడం అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. రేపు సక్సెస్ సాధిస్తానని ఈ రోజు ఏడవడం సరికాదని ఆయన అన్నారు. తన రచనల్లో రాస్తుండగా ఆస్వాదించినది 'వెన్నెల్లో ఆడపిల్ల' అయితే, తెగబాధపడిపోతూ రాసింది మాత్రం 'అంతర్ముఖ'మని, రాసేసిన తరువాత కూడా ఆనందిస్తున్నది 'ఆనందోబ్రహ్మ' అని ఆయన చెప్పారు.