: ఐఐటీ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కి ఫ్లిప్ కార్ట్ రాకుండా చర్యలు!
తదుపరి ఐఐటీల్లో జరిగే క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో తొలి రోజు అవకాశాన్ని పొందే కంపెనీల జాబితా నుంచి ఫ్లిప్ కార్ట్ ను తొలగించనున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ప్లేస్ మెంట్లు నిర్వహించి ఎంతో మంది విద్యార్థులకు లక్షలాది రూపాయల ప్యాకేజీలతో కూడిన వేతనాలు ప్రకటించి, వారిలో ఆశలు రేపి, విధుల్లోకి తీసుకోవడంలో మాత్రం అలసత్వం చూపుతున్న సంస్థను ఈ దఫా వెనక్కి నెట్టాలని ఐఐటీ మానవ వనరుల విభాగాలు నిర్ణయించాయి. నియమించుకున్న ఉద్యోగులకు జాయినింగ్ తేదీని ఇవ్వకుండా ఫ్లిప్ కార్ట్ ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. సంస్థలో ఆటోమేషన్ తో పాటు పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నందునే జాయినింగ్ తేదీలు ఆలస్యమవుతున్నాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించినప్పటికీ, విద్యార్థులు, ఐఐటీ యాజమాన్యాల్లో ఆగ్రహం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే సంస్థ చీఫ్ బిన్నీ బన్సాల్ కు అహ్మదాబాద్ ఐఐఎం ఘాటు లేఖను రాసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో తొలి అవకాశాన్ని సైతం కోల్పోయే ప్రమాదంలో సంస్థ కూరుకుంది.