: ఐపీఎల్ లో ఆడకపోవడం పాక్ క్రికెటర్లకే నష్టం!: పాక్ జట్టు చీఫ్ కోచ్
ఆటను మెరుగుపెట్టుకునేందుకు ఎంతో అవకాశం ఉన్న ఐపీఎల్ లో ఆడకపోవడం పాకిస్థాన్ క్రికెటర్లకు చేటు చేస్తోందని పాక్ జట్టు చీఫ్ కోచ్ మిక్కీ అర్థర్ అంటున్నారు. ఐపీఎల్ వంటి టోర్నీలో భాగం కాకపోవడం పాక్ క్రికెటర్లకు ప్రతిభను పెంచుకునే అవకాశం దూరాన్ని చేస్తోందని అన్నారు. ఐపీఎల్ లో ప్రతిభను ప్రదర్శించిన ఆటగాళ్లంతా తరువాత కెరీర్ లో దూసుకుపోతున్నారని ఆయన గుర్తు చేశారు. క్రికెటర్లు తమ ప్రతిభను పదును పెట్టుకునేందుకు ఇలాంటి టోర్నీలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. పాక్ క్రికెటర్లు టీ20ల్లో కుదురుకోలేకపోవడానికి అనుభవలేమి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ ఆ లోటును పూరించి ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ముంబై దాడుల తరువాత భారత్-పాక్ ల మధ్య సంబంధాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దీంతో ద్వైపాక్షిక టోర్నీలు నిర్వహించేందుకు రెండు దేశాలు సుముఖంగా లేవన్న సంగతి తెలిసిందే.