: అజారుద్దీన్ ఫిక్సింగ్ చేశాడా? లేదా?... నేడు తేలుతుంది!
భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, అభిమానుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్న అజారుద్దీన్, ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. అసలు అజర్ ఫిక్సింగ్ చేశాడా? ఈ ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం లభించలేదు. ఆయన క్రీడా జీవితంలో అసలు జరిగింది ఏమిటి? ఆయన జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? వంటి విషయాలతో కూడిన అజర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించిన సినిమా నేడు విడుదల కానుండటంతో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించవచ్చేమోనని క్రీడాభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం స్క్రిప్ట్ ను పూర్తిగా చదివిన తరువాతనే ఈ సినిమాకు అజర్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన జీవితంలోని మరో కోణానికి చెందిన సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఆయన రెండో భార్య, మాజీ మిస్ ఇండియా సంగీతా బిజిలానీ, నిజ జీవితంలో నటించిన సూపర్ హిట్ చిత్రం త్రిదేవ్ లోని 'ఓయే ఓయే' పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేసి, ఆ పాత్రలో నటిస్తున్న నర్గీస్ ఫక్రీపై చిత్రీకరించడం అదనపు ఆకర్షణ. నేడు విడుదలవుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి హీరోగా నటించగా, రవిశాస్త్రి పాత్రలో గౌతమ్ గులాటీ, సిద్దూ పాత్రలో మన్ జోత్ సింగ్ నటించారు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో ఫిక్సింగ్ పై మీడియా నుంచి ఫిక్సింగ్ పై ప్రశ్నలను ఎదుర్కొన్న అజర్, దీనికి సమాధానం కోసం సినిమా చూడాలని సలహా ఇవ్వడం గమనార్హం. ఇక ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, స్క్రిప్ట్ ను అజర్ అంగీకరించాడు కాబట్టి, తన జీవితంపై మచ్చను పడనీయబోడని సినీ పండితుల అంచనా. అంటే, తాను ఫిక్సింగ్ చేయలేదని, కుంభకోణంలో తన ప్రమేయం లేదని చిత్రంలో స్పష్టం చేస్తాడని పరిశీలకులు అంటున్నారు.