: ఈ నెల 9న అంతరిక్షంలో అద్భుతం
ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం జరగనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దశాబ్దంలో ఎనిమిది సార్లు సంభవించే అద్భుతం ఆరోజు జరగనుందని వారు వెల్లడించారు. బుధగ్రహం సూర్యుడ్ని ఆ రోజు దాటనుందని వారు చెప్పారు. ఈ ఘటనను నేరుగా వీక్షించరాదని హెచ్చరించారు. కళ్లజోళ్లు ధరించి వీక్షించాలని సూచించారు. ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో సూర్యోదయం సమయంలో సంభవించే ఈ ఘటన భారత్ లో మాత్రం సాయంత్రం 4:15 నుంచి 6:20 నిమిషాల మధ్య సంభవించనుందని తెలిపారు. అలాగే, ఎలా పడితే అలా చూస్తే ఇది కనిపించే అవకాశాలు తక్కువని తెలిపారు. కనిపించినా చిన్న తోకచుక్కవలె కనిపిస్తుందని పేర్కొన్నారు. దీంతో దీనిని వీక్షించేందుకు చెన్నైలోని బిర్లా ప్లానెటోరియంలో నాలుగు టెలిస్కోప్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 1999, 2003, 2006లో చోటుచేసుకున్న ఈ అద్భుతం ఈ నెల 9న మళ్లీ చోటు చేసుకుంటుంది. మళ్లీ ఓ పదేళ్ల తరువాత మాత్రమే ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉందని వారు వెల్లడించారు.