: 'మనసులో మాట' చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

ఇండియాలోని ప్రతి ఒక్కరికీ చాలినన్ని మంచి నీరు ఇవ్వడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగనుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ (మనసులో మాట)లో భాగంగా ఆలిండియా రేడియో నుంచి ఆయన ప్రసంగించారు. దేశంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించామని, నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరవు అధికంగా ఉందని గుర్తు చేసిన ఆయన, నీటి కోసం ఇబ్బంది పడటం తనను కలచివేస్తోందని తెలిపారు. పండ్లు, కూరగాయలు తదితర పంటలకు తక్కువ నీరు అవసరపడుతుందని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటిని తీసుకునే పంటలను మాత్రమే వేయాలని సలహా ఇచ్చారు. పడే ప్రతి చుక్క నీటినీ తిరిగి భూమిలోకి చేర్చేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం కన్నా ప్రజలదే అధిక బాధ్యతని గుర్తు చేశారు. ఈ సంవత్సరం సాధారణం కన్నా 10 శాతం అధిక వర్షపాతం నమోదు కావచ్చన్న వాతావరణ శాఖ అధికారుల అంచనాలు తనకెంతో ఆనందాన్ని కలిగించాయని మోదీ తెలిపారు. గంగా నది పూర్తిగా శుభ్రపడితే, వేలాది గ్రామాలకు మంచినీరు అందుతుందని వివరించారు. నాలాల నుంచి వస్తున్న చెత్త నదిలోకి చేరకుండా చూడాల్సి వుందన్నారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వరాదని, ఎక్కడికక్కడ ఒడిసి పట్టాలని సూచించారు. నీటి పొదుపులో భాగంగా పలు ప్రాంతాల్లో స్ప్రింక్లర్ల ద్వారా పొలాలకు నీరందిస్తున్నారని, ఈ తరహా చర్యల వల్ల పలు గ్రామాల రైతులు సత్ఫలితాలు సాధించారని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

More Telugu News