: చౌక స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి దూకేసిన ఎల్జీ!


ఇండియాలో ఖరీదైన ఫోన్ ను ఒకటి అమ్ముకోవడం కన్నా, నాలుగైదు చౌక ధర ఫోన్లు విక్రయించడం సులువని, తద్వారా ఎక్కువ లాభపడవచ్చని ఎల్జీ సంస్థకు తెలిసివచ్చింది. ఇప్పటివరకూ హైఎండ్ ఫోన్ మార్కెట్ ను వదిలిపెట్టని ఎల్జీ, తాజాగా రూ. 15 వేల కన్నా తక్కువ ధర శ్రేణిలోకి ప్రవేశించి కే7, కే10 పేరిట రెండు వేరియంట్లను విడుదల చేసింది. ఈ ఫోన్లను కేంద్ర ఐటీ, సమాచార శాఖా మంత్రి రవిశంకర్, ఎల్జీ ఇండియా ఎండీ కిమ్ కి వాన్ లు మార్కెట్లోకి విడుదల చేశారు. బడ్జెట్ సెగ్మెంట్ లో మరింత మార్కెట్ వాటా కోసమే వీటిని విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా కిమ్ కీ-వాన్ వెల్లడించారు. కాగా, భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 75 శాతం వాటా రూ. 15 వేల లోపున్న ఫోన్లకే ఉంది. ఇక తాజాగా విడుదలైన కే7 ధర రూ. 9,500 కాగా, కే 10 ధర 13,500 అని సంస్థ వెల్లడించింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎల్జీ స్టోర్ల సంఖ్యను 1,720కి పెంచనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News