: అమ్మాయిలపై అత్యాచారం చేస్తానని ఫ్యాకల్టీలే బెదిరిస్తే ఇంకెలా?: ఢిల్లీకి చేరిన తెలుగు విద్యార్థులు
శ్రీనగర్ ఎన్ఐటీలో స్థానికేతర విద్యార్థుల పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, అక్కడి నుంచి బయటపడి ఢిల్లీకి చేరుకోవడానికి తాము అష్టకష్టాలూ అనుభవించామని తెలుగు విద్యార్థులు వాపోయారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన 30 మందికి పైగా విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన ఏపీ భవన్ అధికారులు, వారిని స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టగా, వర్శిటీలోని భయానక పరిస్థితులు ఎలా ఉన్నాయో విద్యార్థులు మీడియాకు వివరించారు.
"నిరసనలు చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులను బెదిరించారు. అమ్మాయిలనైతే, అత్యాచారాలు చేస్తామని ఫ్యాకల్టీలే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక అక్కడ ఎలా ఉండగలం? మా డిమాండ్ ఒక్కటే. నిట్ ను అక్కడి నుంచి తరలించాలి. ఎముకలు విరిగేలా కొట్టిన శ్రీనగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి" అని ఓ తెలుగు విద్యార్థి డిమాండ్ చేశాడు. "మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం. మీరెలా పాసై వెళతారో చూస్తామని ఓపెన్ చాలెంజ్ లు చేస్తున్నారు. అక్కడ ఇక ఉండలేము. నిట్ ను తరలించాలి. లేదంటే మరో వర్శిటీలో ప్రవేశం కల్పించాలి" అని మరో విద్యార్థి కోరాడు.