: భారత బ్యాంకులపై 'నెగటివ్' రేటింగ్... ఈక్విటీలు ఢమాల్!
భారత్ లో ప్రభుత్వ రంగ బ్యాంకులపై తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నామని రేటింగ్ సంస్థ క్రిసిల్ చేసిన ప్రకటనతో పీఎస్యూ బ్యాంకుల ఈక్విటీలు ఒత్తిడికి లోనయ్యాయి. పలు బ్యాంకుల అసెట్ క్వాలిటీ తగ్గిపోయిందని, ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకుల రేటింగ్ ను స్టేబుల్ (స్థిరం) నుంచి వాచ్ నెగటివ్ (వ్యతిరేకత రావచ్చు)కు, మరో ఐదు బ్యాంకుల రేటింగ్ ను స్టేబుల్ నుంచి నెగటివ్ కు మార్చుతున్నట్టు ప్రకటించింది. దీంతో నేటి ట్రేడింగ్ సెషన్లో బ్యాంకింగ్ సెక్టారు కుదేలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఐడీబీఐ, అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.69 శాతం దిగజారింది.