నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండండి: విద్యార్థులకు మోదీ విలువైన సూచన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండండి: విద్యార్థులకు మోదీ విలువైన సూచన

విద్యార్థులు భవిష్యత్తు దిశగా మరో ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైందని, పరీక్షలు మొదలు కానున్న వేళ ఎంత నిబ్బరంగా, ప్రశాంతంగా ఉంటే, అంత సులువుగా విజయానికి దగ్గరవుతారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 'మన్ కీ బాత్'లో భాగంగా ఆకాశవాణి సహా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు శుభాకాంక్షలతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కేవలం మార్కుల కోసమే ప్రయత్నించ వద్దని, అంతకుమించిన సంకల్పం ముఖ్యమని అన్నారు. ఇతర విద్యార్థులతో పోటీ పడే బదులు ఎవరితో వారే పోటీ పడి ముందుకు సాగాలని సూచించారు. నిత్యమూ నేర్చుకున్న పాఠాలను అదే రోజు పునశ్చరణ చేసుకోవడం వల్ల పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. రేపటి నుంచి తన మనసులో మాటను ఎవరి భాషలో వారు వినవచ్చని, అందుకు 81908 81908 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న వేళ, రేపు బడ్జెట్ రూపంలో తన ప్రభుత్వం ముందు ఓ ప్రధాన పరీక్ష ఉందని అన్నారు. సైన్స్ లో ముందంజ వేసే దిశగా ఎల్ఐజీఓ (లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ) ఏర్పాటు శుభపరిణామమని, దీనివల్ల మరింత మంది శాస్త్రవేత్తలు తయారవుతారని వివరించారు.

More Telugu News