: ఇన్వెస్టర్లను మెప్పించని 'ప్రభు' ప్రసంగం... నష్టాలలో స్టాక్ మార్కెట్!


మేకిన్ ఇండియా పేరు ఎన్నిసార్లు ఉచ్చరించినా, రైల్వేల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి పచ్చజెండా ఊపుతున్నట్టు వెల్లడించినా, ఐటీ సంస్థలకు పని కల్పించేలా 'స్మార్ట్' పదాన్ని పలుమార్లు వాడినా సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయింది. రైల్వేలతో సంబంధమున్న కంపెనీలతో పాటు, మౌలిక రంగంలోని కంపెనీలు, ఐటీ, బ్యాంకింగ్ రంగంలో కొనుగోలు మద్దతు కనిపించకపోవడంతో సూచికలు నష్టపోయాయి. సురేష్ ప్రభు ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే భారీ నష్టాల దిశగా సాగిన సూచికలు, ఆపై యూరప్ మార్కెట్ సరళిని చూసిన తరువాత కాస్తంత తేరుకున్నాయి. ఆ తరువాత కూడా ఒడిదుడుకులు కొనసాగి స్వల్ప నష్టాల్లో సెషన్ ను ముగించాయి. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 112.93 పాయింట్లు పడిపోయి 0.49 శాతం నష్టంతో 22,976.00 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 48.10 పాయింట్లు పడిపోయి 0.69 శాతం నష్టంతో 6,970.60 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ 0.91 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఐడియా, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీలు లాభపడగా, పవర్ గ్రిడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఏసీసీ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,623 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 934 కంపెనీలు లాభాల్లోను, 1,532 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 86,58,842 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ మంగళవారం నాడు రూ. 86,14,175 కోట్లకు తగ్గింది.

  • Loading...

More Telugu News