మూడు నెలలు దాక్కొని ఆపై కాశ్మీరులో చిక్కిన జైషే మహమ్మద్ ఉగ్రవాది
ఇండియాలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు పాకిస్థానే కారణమనడానికి మరో ముఖ్యమైన సాక్ష్యం లభించింది. ఈ ఉదయం జమ్మూకాశ్మీర్ పరిధిలోని బారాముల్లా జిల్లాలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఒక ఉగ్రవాది సైన్యానికి చిక్కాడు. అతని పేరు మహమ్మద్ సాదిక్ గుజ్జార్ అని, వయసు 17 సంవత్సరాలని తెలుస్తోంది. సరిగ్గా 3 నెలల క్రితం కుప్వారా జిల్లాలోని తంగ్ ధార్ ఆర్మీ క్యాంపుపై దాడి చేసి తప్పించుకున్న వారిలో సాదిక్ ఒకడని అధికారులు తెలిపారు. ఆ ఘటనలో పాల్గొన్న నలుగురిలో ముగ్గురు మరణించగా, ఇతను తప్పించుకున్నాడని, ఆపై అజ్ఞాతంలో ఉన్నాడని తెలిపారు. రాష్ట్ర పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు, సైన్యం జరిపిన సంయుక్త ఆపరేషన్ లో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు సహా సాదిక్ పట్టుబడ్డాడని, ఇతను పాక్ లోని సియాల్ కోటకు చెందినవాడని వివరించారు. దాదాపు రెండు వారాల పాటు నిఘా పెట్టి ఇతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.