హర్యానాలో అల్లర్ల వేళ... సైన్యం సాయంతో కలిసిన మనసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హర్యానాలో అల్లర్ల వేళ... సైన్యం సాయంతో కలిసిన మనసులు!

తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాట్ వర్గీయులు చేస్తున్న నిరసనలు ఉద్ధృత రూపంలో జరుగుతున్న వేళ, ఓ జంట కథను సైన్యం సుఖాంతం చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నెలల తరబడి సాగిన వివాహ ప్రయత్నాల అనంతరం, మరికొన్ని గంటల్లో తాళి కట్టనున్న వేళ, ఇంటికి కొద్ది కిలోమీటర్ల దూరంలోని కల్యాణ మండపానికి వెళ్లలేని పరిస్థితి వధూవరులది. రోహ్ తక్ పూర్తి దిగ్బంధం కాగా, ప్రజల్లో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. ఓ వైపు కర్ఫ్యూ, మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం. ఈ సమయంలో తమ వీధిలో వెళుతున్న సైన్యానికి విషయం చెప్పారు వధువు నేహా తరఫు బంధువులు. వారు గూర్ఖా రైఫిల్స్ కు చెందిన సైనికులు. వారంతా రక్షణగా నిలిచి వధువు నేహ, వరుడు గౌరవ్ లను సమీపంలోని గురుద్వారాకు చేర్చారు. సెక్యూరిటీగా నిలిచి వివాహం జరిపించడంతో పాటు, తిరిగి ఇంటికి చేర్చారు. "వివాహాన్ని వాయిదా వేసుకునే పరిస్థితి లేదు. మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. సైన్యం చేసిన సహాయాన్ని మరువలేము" అని నేహా తల్లి సంతోషా సంతోషంగా వెల్లడించారు. తాము విధి నిర్వహణలో భాగంగా రోహ్ తక్ లోని గురుచరణ్ పురా ప్రాంతానికి వెళ్లినప్పుడు ఓ కుటుంబం వివాహ వేదికకు చేరలేక ఇబ్బందులు పడుతోందని తెలిసి సాయపడ్డామని గూర్ఖా రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సూరజ్ చాంబియాల్ వెల్లడించారు. వధువు తన కుమార్తేనని భావించినట్టు తెలిపారు.

More Telugu News