: చెక్ బౌన్స్ కేసులో నటుడు దిలీప్ కుమార్ కు ఊరట
బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు దిలీప్ కుమార్ కు 18 ఏళ్ల నాటి చెక్ బౌన్స్ కేసులో ఊరట లభించింది. ఈ మేరకు ముంబయిలోని గిర్గాం మేజిస్ట్రేట్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 1998లో జీకే ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో దిలీప్ గౌరవ ఛైర్మన్ గా ఉన్నారు. ఎగుమతి వ్యాపారం చేసే ఈ కంపెనీ ఇచ్చిన చెక్ లు బౌన్స్ కావడంతో దిలీప్ సహా కంపెనీ నిర్వాహకులపై బాధితులు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు నమోదైంది. తరువాత కాలంలో దీలీప్ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కోర్టు ఆయన వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిచ్చింది. అయితే కంపెనీ కార్యకలాపాల్లో దిలీప్ కు నేరుగా ప్రమేయం లేదని, దాంతో చెక్ బౌన్స్ కేసులో కూడా ఆయన పాత్రలేదని న్యాయవాది వాదించారు. సుదీర్ఘ విచారణ తరువాత ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.