: తిరుమలేశుడి సేవలన్నీ ‘డిజిటల్’... టీసీఎస్ తో జట్టుకట్టిన టీటీడీ
తిరుమల వెంకన్న సేవలన్నీ ఇకపై ‘డిజిటల్’ కానున్నాయి. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వెంకన్న భక్తులకు అందిస్తున్న సేవలన్నిటినీ ఇకపై డిజిటలైజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ సాంబశివరావు నిన్న సగర్వంగా ప్రకటించారు. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)’తో జట్టు కట్టిన టీటీడీ... ‘డిజిటల్ తిరుమల’ పేరిట అన్ని సేవలను ఆన్ లైన్ చేస్తోంది. ఈ దిశగా నిన్న ఓ కీలక అడుగు పడింది.
టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ తో నిన్న ప్రత్యేకంగా సమావేశమైన సాంబశివరావు, ఆ తర్వాత డిజిటల్ తిరుమలను ప్రకటించారు. శ్రీవారి దర్శనానికి ‘ఈ-దర్శన్’, వసతి సౌకర్యం కోసం ‘ఈ-అకామిడేషన్’, హుండీలో కానుకలు చెల్లించేందుకు ‘ఈ-హుండీ’ తదితరాలతో పాటు టీటీడీ పబ్లికేషన్లు, టీటీడీ ఆడియో, వీడియో సీడీలను ఇకపై ఎక్కడి నుంచైనా పొందవచ్చు. ఈ మేరకు ‘డిజిటల్ తిరుమల’ ప్రాజెక్టును టీసీఎస్ ఉచితంగానే చేసిపెడుతోందని సాంబశివరావు తెలిపారు.