: జాతీయత పేరుతో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు: 'జేఎన్యూ' ఏబీవీపీ సెక్రటరీ జనరల్

జేఎన్ యూలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆవేదనతో ఏబీవీపీ సెక్రటరీ జనరల్ ప్రదీప్ నర్వాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామాపై మాట్లాడుతూ, జేఎన్ యూలో చేరుతానని తన తల్లిని అడిగినప్పుడు ముందు యూనివర్సిటీ గురించి అడిగారని, అప్పుడు దేశంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో అదొకటని చెప్పానని అన్నారు. ఇప్పుడు తన తల్లి 'ఇదేనా నువ్వు చెప్పిన జేఎన్ యూ అంటే?' అని నిలదీశారని చెప్పారు. జేఎన్ యూలో ఘటనపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై నిరసనతో ఆయన, ఆయనతో పాటు మరికొంత మంది నేతలు ఏబీవీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ లేఖలో జేఎన్ యూ విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రధానిగా ఇప్పటికైనా కలుగజేసుకోవాలని ఆయన మోదీని కోరారు. తనకు తెలిసి యూనివర్సిటీ అంటే ఒక స్వతంత్ర విద్యావ్యవస్థ అని ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల బాధలు తగ్గించాల్సింది పోయి, జాతీయత పేరుతో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. జేఎన్ యూను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా చూపే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశానని ఆయన లేఖలో స్పష్టం చేశారు.

More Telugu News