: జేఎన్ యూలో భారత వ్యతిరేక కార్యకలాపాలు... విద్యార్థి సంఘాల మధ్య యుద్ధం!

న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఓ వర్గం విద్యార్థులు పార్లమెంటుపై దాడి కేసులో ఉరితీయబడ్డ అఫ్జల్ గురును 'షహీద్'గా అభివర్ణిస్తూ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమాన్ని మరో వర్గం విద్యార్థులు అడ్డుకోవడంతో పెను ఉద్రిక్తత తలెత్తింది. గత రాత్రి ఇరు వర్గాల విద్యార్థులు యుద్ధానికి దిగగా, భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. వర్శిటీ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఏర్పాటైన ఓ కార్యక్రమంలో 'షాహీద్ అఫ్జల్ గురు' అంటూ, భారత వ్యతిరేక నినాదాలు చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ అనుబంధ ఏబీవీపీ సభ్యులు దాన్ని అడ్డుకున్నారు. ఆపై వర్శిటీ చాన్స్ లర్ కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వర్శిటీ పరిధిలోని సబర్మతీ దాబా గోడలపై అంటించిన పలు కరపత్రాలు విద్యార్థి సంఘాల మధ్య వేడిని రగిల్చాయి. అఫ్జల్ గురును అన్యాయంగా చంపారని, కాశ్మీర్ పరిస్థితి ఘోరమని వ్యాఖ్యానిస్తూ పోస్టర్లు వెలువగా, వాటిని ఏబీవీపీ విద్యార్థులు చించివేశారు. ఆపై గత రాత్రి రెండు వర్గాల మధ్యా వాగ్వాదం, బాహాబాహీ జరిగిందని, వర్శిటీలో శాంతి నెలకొల్పేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశామని వీసీ జగదీష్ కుమార్ తెలిపారు. ఓ సాంస్కృతిక కార్యక్రమం జరుపుకుంటామని కొందరు విద్యార్థులు సంప్రదించగా, తాను అనుమతి ఇచ్చానని, అయితే, అది భారత వ్యతిరేక కార్యక్రమమని తెలిసి అనుమతిని నిరాకరించామని తెలిపారు.

More Telugu News