: ‘కుల’ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సెల్ టవర్ ఎక్కిన విద్యార్థి... బెజవాడలో ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ‘కాపు ఐక్య గర్జన’లో చోటుచేసుకున్న హింస, ఆ తర్వాత కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష, సర్కారు రాజీ మంత్రం నేపథ్యంలో... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాపుల రిజర్వేషన్ల పోరాటం కాస్తా... కాపులు, బీసీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీసింది. మరోపక్క నేటి ఉదయం విజయవాడలోని రామవరప్పాడులో ఇంజనీరింగ్ చదువుతున్న రవితేజ అనే విద్యార్థి... కులాల ప్రాతిపదికన ఇస్తున్న రిజర్వేషన్లను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు. కులాల ప్రాతిపదికగా కాకుండా పేదరికం ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు.
ఈ విషయం నగరవ్యాప్తంగా క్షణాల్లో విస్తరించింది. మీడియా ప్రతినిధులు అక్కడికి ఉరుకులు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. తనను దించేందుకు యత్నిస్తే, దూకేస్తానని అతడు బెదిరించడంతో అగ్నిమాపక సిబ్బంది కిందే నిలిచిపోయారు. ఇక తన సెల్ ఫోన్ నెంబరును పేపర్ పై రాసి కిందకు విసిరిన అతడు... కులాల ప్రాతిపదికగా ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి పేదరికాన్ని ఆధారం చేసుకుని ప్రవేశపెట్టే రిజర్వేషన్లకు తన వద్ద బ్రహ్మండమైన ప్లాన్ ఉందని కూడా చెప్పాడు. ఈ మేరకు తనతో మాట్లాడేందుకు ప్రభుత్వ ప్రతినిధితో పాటు మీడియా ప్రతినిధి రావాలని డిమాండ్ చేశాడు. అంతేకాక టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తనతో మాట్లాడాలని అతడు డిమాండ్ చేశాడు.