: ‘పాన్’ నమోదుపై నగల వ్యాపారుల గుస్సా... నేడు దేశవ్యాప్తంగా జ్యువెల్లర్స్ షాపుల బంద్
బంగారు ఆభరణాల కొనుగోలుదారులతో నిత్యం కళకళలాడే జ్యువెల్లరీ షాపులు నేడు దేశవ్యాప్తంగా బోసిపోనున్నాయి. రూ.2 లక్షలకు పైబడిన కొనుగోళ్లన్నింటికీ ‘పాన్ కార్డు’ నమోదు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నగల వ్యాపారులు నేడు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో నేడు దేశంలోని ఏ ఒక్క నగల దుకాణం కూడా తెరచుకోదు. ఈ బంద్ పై నిన్న ఎంజీజేటీఎఫ్ ప్రతినిథి మోహన్ లాల్ జైన్...సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘‘దేశంలో 18 శాతం మందికి మాత్రమే పాన్ కార్డులున్నాయి. రైతుల్లో చాలా మందికి పాన్ కార్డుల్లేవు. ఇప్పటికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగల వ్యాపారం... రూ.2 లక్షలకు పైబడ్డ కొనుగోళ్లకు పాన్ కార్డు నమోదుతో మరింత కూనారిల్లే ప్రమాదముంది. మార్కెట్ లో 70 శాతానికి పైగా కొనుగోళ్లు గ్రామీణులు చేసేవే. వారిలో ఎక్కువ మందికి పాన్ కార్డులుండవు. సాదాసీదా పెళ్లికే దాదాపు 250 గ్రాముల బంగారం కొంటారు. దీని విలువ దాదాపు రూ.7.5 లక్షలుంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో చిన్న వ్యాపారులు దెబ్బతింటారు. ఆభరణాల కొనుగోలు ద్వారా నల్లధనం పోగయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదు’’ అని ఆయన చెప్పారు.