: గుంటూరులో చెత్త ఆధారిత విద్యుదుత్పత్తి ప్రాజెక్టు... జిందాల్ తో ఏపీ సర్కారు ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో త్వరలో చెత్త ఆధారిత విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణం కాబోతోంది. ఈ మేరకు జిందాల్ స్టీల్స్ తో ఏపీ ప్రభుత్వం ఇవాళ ఒప్పందం చేసుకుంది. విద్యుదుత్పత్తి కోసం విజయవాడ, గుంటూరు సహా 7 మున్సిపాలిటీల నుంచి చెత్త సేకరిస్తారు. ఈ క్రమంలో 1200 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించేందుకు ఒప్పందం కుదిరింది. రూ.150 కోట్లతో చేపట్టనున్న ఈ చెత్త ఆధారిత ప్రాజెక్టు తొలిదశలో 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 2 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం స్థలాన్ని అప్పగించనుంది. 18 నెలల్లో ప్లాంట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.