ఉన్నత విద్యాసంస్థల్లోకి రాజకీయాలు ప్రవేశించడం హర్షణీయం కాదు: త్రిపుర ముఖ్యమంత్రి
రాజకీయ భావాలల్లో వైరుధ్యం ఉండడం తప్పుకాదని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ వైరుధ్యం ఉండడం తప్పుకాదని, అయితే అది రోహిత్ లాంటి భావి మేధావిని కోల్పోయేంత తీవ్రమైన వైరుధ్యం ఉండడం సరికాదని అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న రోహిత్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినవి రాజకీయ కారణాలన్న విషయం... ఈ ఘటన గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా అర్థమవుతుందని ఆయన తెలిపారు. ఈ విధానం సరికాదని ఆయన సూచించారు. ఉన్నత విద్యాసంస్థల్లోకి రాజకీయాలు ప్రవేశించడం హర్షణీయం కాదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల మధ్య సమస్యలు పరిష్కరించాల్సిన యూనివర్సిటీ యాజమాన్యం నేతల మెప్పుకోసం ప్రయత్నంచడం శోచనీయమని తెలిపారు. జరిగిన ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారా సమాజానికి సరైన సందేశం ఇవ్వాలని, ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.