: రూ. 3కు పైగా తగ్గుతుందనుకుంటే 50 పైసలు మాత్రమే తగ్గిన పెట్రోలు ధర, కారణమిదే!
మంగళవారం నాడు పెట్రోలు ధరను 50 పైసలు, డీజిల్ ధరను 46 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు లీటరు పెట్రోలు ధర రూ. 3 నుంచి రూ. 4 వరకూ తగ్గవచ్చని విశ్లేషకులు అంచనాలు వేయగా, ఆ మేరకు ప్రయోజనం లభించకపోవడంతో వాహన యజమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భారత క్రూడాయిల్ బాస్కెట్ ధర మంగళవారం నాడు 11 సంవత్సరాల కనిష్ఠ స్థాయిలో 34.39 డాలర్ల వద్ద లభించింది. అయితే, పక్షం రోజుల సరాసరి దానికి 5 డాలర్ల వరకూ అధికంగా 39 డాలర్ల వద్ద ఉంది. దీనికితోడు గత కొంతకాలంగా డాలర్ తో రూపాయి మారకపు విలువ కుదేలవుతూ వస్తోంది. మారకపు విలువలో నవంబర్ సరాసరి రూ. 66.21కాగా, సోమవారం నాడు అది 66.99కి, ఆపై మంగళవారం నాడు రూ. 67ను అధిగమించింది. మారకపు విలువలో ఒడిదుడుకులే చమురు సంస్థలపై ఒత్తిడిని పెంచాయని చమురు రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.
ఇక ఇండియాలో పెట్రో ఉత్పత్తులపై ప్రభుత్వ సుంకాలూ తక్కువేమీ కాదు. నవంబర్ 2014 నుంచి జనవరి 2015 మధ్య పెరిగిన సుంకాల కారణంగానే రూ. 20 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ఖజానాకు చేర్చుకున్న కేంద్రం, ఆపై ఈ సంవత్సరం నవంబర్ 7న పెట్రోలుపై రూ. 1.60, డీజిల్ పై 40 పైసల ఎక్సైజ్ సుంకాన్ని విధించి మరో రూ. 3,200 కోట్ల అదనపు ఆదాయాన్ని వెనకేసుకుంది. దీనికి అదనంగా రాష్ట్రాలు సైతం కేంద్రం నడిచిన బాటలో వెళ్తూ, పన్నులను పెంచుకుంటున్నాయి. కాగా, రూపాయి విలువ మెరుగుపడితే, తదుపరి పక్షంలో కూడా పెట్రోలు ధరలు తగ్గుతాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ధర ఎంత తగ్గినా, ఆ వెంటనే సుంకాలు పెంచకుండా ఉంటేనే ఆ ప్రయోజనం వాహనదారులకు చేరుతుందన్నది మాత్రం వాస్తవం.