: మరింతగా పెరగనున్న సిగరెట్ ధరలు, ఐటీసీ, గాడ్ ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ డౌన్!
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)పై సమీక్ష జరిపిన ఆర్థిక వ్యవహారాల సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్నులను విధించాలని సిఫార్సు చేయడం, ఆ రంగంలోని కంపెనీల ఈక్విటీల్లో సెంటిమెంటును హరించివేసింది. సిగరెట్ తయారీ, మార్కెటింగ్ రంగంలో ఉన్న ఐటీసీ, గాడ్ ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఐటీసీ 6.83 శాతం పతనమై రూ. 313కు చేరగా, 42.8 లక్షల ఈక్విటీ వాటాలు చేతులు మారాయి. గాడ్ ఫ్రే పిలిప్స్ ఇండియా ఈక్విటీ 5 శాతం దిగజారి రూ. 1,493కు, వీఎస్టీ ఇండస్ట్రీస్ ఈక్విటీ 2 శాతం పతనమై రూ. 1,650కి చేరాయి. ఇదే సమయంలో యూఎస్ ఫెడ్ పరపతి సమీక్ష భయాలు ఇన్వెస్టర్లను నూతన కొనుగోళ్లకు దూరంగా ఉంచడంతో భారత స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈక్విటీలను విక్రయించినట్టు సెబీ గణాంకాలు వెల్లడించాయి. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 108 పాయింట్లు పడిపోయి 0.42 శాతం నష్టంతో 25,530.11 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 16.50 పాయింట్లు పడిపోయి 0.21 శాతం నష్టంతో 7,765.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.10 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.16 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభాల్లో నడిచాయి. ఆసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు లాభపడగా, ఐటీసీ, కెయిర్న్, కోల్ ఇండియా, రిలయన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,79,857 కోట్లకు తరిగింది. మొత్తం 2,924 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,444 కంపెనీలు లాభాలను, 1,319 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.