: భయపెడుతున్న యూఎస్ ఫెడ్... అనునయించేందుకు రిజర్వ్ బ్యాంక్ వ్యూహాలు!


మరో పది రోజుల్లో జరిగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాందోళనల్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్న వేళ, ఒడిదుడుకులను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా దేశవాళీ బాండ్లపై రాబడులను సమతుల్యం చేసేలా రూపాయి విలువను పట్టి నిలపాలని, అందుకోసం డాలర్లను విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2013లో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచిన వేళ, మార్కెట్ల పతనం మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నదే ఆర్బీఐ అభిమతం. తదుపరి బాండ్లను వేలం వేసే సమయంలోనూ ఆఫర్ చేస్తున్న వడ్డీపై మరింత మొత్తాన్ని ఇస్తామన్న హామీని ఇవ్వాలని కూడా రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. కాగా, ఈ సంవత్సరం ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లతో పోలిస్తే, మన సెన్సెక్స్, నిఫ్టీలు మెరుగైన ఫలితాలను అందించినప్పటికీ, యూఎస్ ఫెడ్ భయాలను మాత్రం దూరం పెట్టలేకపోయింది. ఒక్క నవంబరు నెలలోనే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సుమారు రూ. 10,700 కోట్ల విలువైన ఈక్విటీ వాటాలను విక్రయించి, లాభాలను వెనక్కు తీసుకువెళ్లారంటే వారిలో నెలకొన్న భయాన్ని ఊహించొచ్చు. డాలర్ తో రూపాయి మారకపు విలువ రెండు సంవత్సరాల కనిష్ఠానికి దిగజారడానికి కూడా ఫెడ్ భయమే ప్రధాన కారణం. ఈ నెల 15, 16 తేదీల్లో ఫెడ్ పరపతి సమీక్ష జరగనుంది. ఫెడ్ నిర్ణయం వెలువడేంత వరకూ మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసే విశ్లేషణలు, కథనాలు వద్దని ఓ ఆర్బీఐ అధికారి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News