: గ్రూప్ 1, 2 పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ: నారా బ్రాహ్మణి
గ్రూప్ 1, 2లతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తామని టీడీపీ యువనేత నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి తెలిపారు. పేద విద్యార్థుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 800 మందికి శిక్షణ అందిస్తామని వెల్లడించారు. నిపుణులతో శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి కూడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామని... తద్వారా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలను సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. 2005లో ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లను ప్రారంభించామని... వీటి ద్వారా గత పదేళ్ల కాలంలో వేలాది విద్యార్థులను తీర్చిదిద్దామని బ్రాహ్మణి వెల్లడించారు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.