: మోదీ సర్కారుతో పోరుకు దిగిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ!
వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టిన కోట్లాది రూపాయలు రిస్క్ లో పడటం, పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలు అడ్డంకులుగా నిలవడంతో మోదీ సర్కారుతో చట్టపరమైన పోరుకు దిగాలని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. పెట్టిన పెట్టుబడి ప్రమాదంలో పడటానికి కారణం రిలయన్స్ తీసుకున్న నిర్ణయాలేనని ప్రభుత్వం ఆరోపిస్తోంది. రిలయన్స్ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన లాభాలు సైతం తగ్గాయని ఆరోపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలైన ఎన్టీపీసీ, ఓఎన్జీసీ తదితర సంస్థలతో పలు వివాదాలను కోర్టుల పరిధిలో ఎదుర్కొంటున్న రిలయన్స్ సంస్థ, ఇప్పుడు సహజవాయు ధరల విధానంపై కేంద్రంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఈ కేసును వాదించేందుకు పేరున్న న్యాయవాది హరీష్ సాల్వేను నియమించుకుంది. కేంద్రంతో రిలయన్స్ పోరు ఈనాడు ప్రారంభమైంది కాదు. 2006లో కేజీ బేసిన్ లో సహజవాయు వెలికితీత ప్రారంభం కాగానే, అక్కడి నుంచి తమకు గ్యాస్ సరఫరా చేయాలని వాదిస్తూ, ఎన్టీపీసీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆపై ఎన్టీపీసీకి ఒక్కో యూనిట్ గ్యాస్ కు 2.4 డాలర్లతో సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ, ఆపై ఉత్పత్తి వ్యయం పెరిగిందన్న సాకుతో ధరను పెంచాలని కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికీ ఈ కేసు పూర్తి కాలేదు. తాము ఎన్టీపీసీతో ఎటువంటి కాంట్రాక్టునూ కుదుర్చుకోలేదన్నది ప్రస్తుతం రిలయన్స్ చేస్తున్న వాదన. మరోవైపు ఒఎన్జీసీతో సైతం రిలయన్స్ వివాదాలపై ఢిల్లీ కోర్టు పరిధిలో విచారణ జరుగుతోంది. తమ రిజర్వాయర్ లలోని గ్యాస్ ను రిలయన్స్ తీసుకుంటోందన్నది ఓఎన్జీసీ వాదన. అయితే, భూగర్భంలోని గ్యాస్ రిలయన్స్ చమురు క్షేత్రాల్లోకి వస్తున్నదని డీఅండ్ఎం అనే స్వతంత్ర కన్సల్టెంట్ సంస్థ నివేదిక ఇచ్చింది. అయినా, తమ గ్యాస్ తమకు ఇవ్వాల్సిందేనని ఓఎన్జీసీ కోర్టులో వాదిస్తోంది. ప్రకృతి సహజంగా జరిగే మార్పులకు తాము బాధ్యత వహించబోమని, తమ గ్యాస్ ఓఎన్జీసీ క్షేత్రాల్లోకి వెళితే, వారు వాటా ఇస్తారా? అని రిలయన్స్ ప్రశ్నిస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే కేజీ బేసిన్ లోని గ్యాస్ నిల్వలపై రిలయన్స్ వేసిన అంచనాలు తప్పాయి. మొత్తం 10 లక్షల కోట్ల ఘనపు అడుగుల గ్యాస్ ఉంటుందని భావిస్తూ, డీ1, డీ3 బ్లాకుల్లో రూ. 50 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టిన సంస్థ చివరికి అక్కడ 2.1 లక్షల కోట్ల ఘనపు అడుగుల గ్యాస్ మాత్రమే ఉందని తెలుసుకుని అవాక్కైంది. ఇప్పుడీ వాటాల కేసులు సంస్థను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడిక తాజాగా 'మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు' కేంద్రంతో గ్యాస్ ప్రైసింగ్ వివాదం సంస్థను చుట్టుముట్టింది. సహజవాయు ధరలను సవరించాలన్న రిలయన్స్ విజ్ఞప్తిని మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేజీ బేసిన్ లో పెట్టిన ఖర్చును అధికంగా చూపడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టిందని ఆరోపిస్తూ, విషయం తేల్చాలని విచారణకు ఆదేశించింది కూడా. దీంతో ఇక కేంద్రంపైనా కోర్టును ఆశ్రయించి పోరాడి తమ హక్కులను కాపాడుకోవాలని ముఖేష్ అంబానీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ గొడవల కారణంగా సంస్థ ఈక్విటీ విలువ గణనీయంగా పడిపోతోంది. పలువురు ఇన్వెస్టర్లు రిలయన్స్ లోని తమ వాటాలను విక్రయించుకుంటుండటం సంస్థను మరింత ఇబ్బంది పెడుతున్న అంశమని నిపుణులు అంచనా వేస్తున్నారు.