: కింకర్తవ్యం... రిలయన్స్ దిగితే ఎలా? ఆలోచనలో పడ్డ ఎయిర్ టెల్!


ప్రస్తుతానికి దేశంలో 4జీ సేవలను అందిస్తూ, "ఇంతకన్నా వేగవంతమైన నెట్ వర్క్ దొరికితే, జీవితాంతం మొబైల్ బిల్స్ ఫ్రీ" అని ప్రచారం చేసుకుంటూ సాగుతున్నప్పటికీ, ఎయిర్ టెల్ మది నిండా దిగులే. ఎందుకో తెలుసా? ఈ రంగంలో ఎయిర్ టెల్ కు ప్రధాన పోటీదారు ఇంకా రంగంలోకి దిగలేదు కాబట్టి. దేశవ్యాప్తంగా 4జీ తరంగాల లైసెన్స్ లను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో ఈ డిసెంబర్ లోగా మార్కెట్లోకి రానుంది. అప్పుడు పలు సర్కిళ్లలో 4జీ తరంగ అనుమతులు లేని ఎయిర్ టెల్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ప్రస్తుతం ఎయిర్ టెల్ ను తొలిచేస్తున్న పెను సమస్య. కాగా, పోటీని తట్టుకునేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో 4జీ సేవలను అందించేందుకు ఎయిర్ సెల్ తో డీల్ కుదుర్చుకోవాలని ఎయిర్ టెల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తపై ఇప్పటివరకూ అధికారిక సమాచారం లేకపోయినా, మార్కెట్ వర్గాల అంచనా మేరకు ఇప్పటికే ఈ రెండు కంపెనీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. స్పెక్ట్రమ్ ట్రేడింగ్ రూట్ లోనే ఎయర్ సెల్ 4జీ బ్యాండ్ విడ్త్ ను కొనుగోలు చేయాలని ఎయిర్ టెల్ భావిస్తోందని, ఈ దిశగా ఉన్నతాధికారుల మధ్య చర్చలు కూడా జరిగాయని సమాచారం. ఈ డీల్ కుదరాలంటే ఎన్నో అవాంతరాలు ఉన్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. స్పెక్ట్రమ్ ను పంచుకోవాల్సి వస్తుందని, అప్పుడు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇరు కంపెనీలకూ తరంగాల లైసెన్సులు ఉన్నందున, ఇక్కడ తరంగ పరిమితిని రెండు కంపెనీలూ దాటిపోతాయని ఆయన తెలిపారు. ఇది కాస్త ఇబ్బందికర అంశమని ఆయన వివరించారు. ఇదిలావుండగా, ఇప్పటికే 'క్వాల్ కామ్' లైసెన్స్ లను పొందిన నాలుగు సర్కిళ్లలో ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని ఎయిర్ టెల్ 4జీ సేవలను ప్రారంభించింది. తాజాగా చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లైసెన్స్ లున్న 'అగ్యూర్'తో డీల్ కోసం ప్రయత్నిస్తోందని కూడా సమాచారం. రూ. 20 వేల కోట్ల మేరకు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ సెల్ సంస్థ ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్ టెల్ తో డీల్ కు ముందుకు రావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 22 టెలికాం సర్కిళ్లుండగా, ఎయిర్ టెల్ కు 15 సర్కిళ్లలో 4జీ సేవలకు అనుమతులు ఉన్నాయి. మిగతా సర్కిళ్లలో ఇవే సేవలు అందించాలంటే, అక్కడ లైసెన్స్ లు పొందిన సంస్థలతో డీల్స్ కుదుర్చుకుని వాటికి లాభాల్లో భాగం ఇవ్వక తప్పని పరిస్థితి. ఇదే ఆ సంస్థ ముందున్న పెను సవాల్. ఈ సవాల్ ను అధిగమించలేకుంటే, దేశవ్యాప్త సేవలతో రిలయన్స్ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News