: సరికొత్త బాధ్యతల్లో ఇంజమామ్...ఆఫ్ఘాన్ జట్టు కోచ్ గా పాక్ మాజీ కెప్టెన్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. నిన్నటిదాకా పాక్ జట్టులో స్టార్ ప్లేయర్ గా వెలుగొందిన ఇంజమామ్ ప్రపంచ క్రికెట్ లో పసికూన అప్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు అభ్యర్థనకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఈ నెలలో జింబాబ్వే లో పర్యటించనున్న అఫ్ఘాన్ జట్టు ఆతిథ్య జట్టుతో 5 వన్డేలు, రెండు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ లోగానే ఇంజమామ్ అఫ్ఘాన్ జట్టుకు కోచ్ గా బాధ్యతలు చేపడతాడట. క్రికెట్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంజమామ్ సలహాలతో తమ జట్టు బలమైన జట్టుగా మారుతుందని అఫ్ఘాన్ బోర్డు సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే జింబాబ్వే టూర్ కు మాత్రమే కోచ్ గా ఉండేందుకు తాను అంగీకరించానని ఇంజామామ్ చెబుతున్నాడు. ఈ టూర్ తర్వాత కోచ్ గా కొనసాగే విషయంపై అతడు స్పందించలేదు.