: ఇంత అన్యాయమా?: చంద్రబాబుపై జగన్ నిప్పులు
రాష్ట్రంలో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ఇంత అన్యాయాన్ని చంద్రబాబునాయుడు కళ్లతో చూస్తూ ఊరుకున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలం ఇంకా జరుగుతుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద పొగాకు వేలం కేంద్రం వద్ద జరుగుతున్న రైతుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆయన ప్రసంగించారు. డిమాండుకు తగినట్టుగా సరఫరాలేని సమయంలో ధరలు పెరగాల్సింది పోయి తగ్గుతున్నాయని ఆయన అన్నారు.
జూన్ తో ముగియాల్సిన వేలం ఇంకా కొనసాగుతోందని, గత సంవత్సరంతో పోలిస్తే ధరలు మరింతగా తగ్గడం రైతులను ఇబ్బందులు పెడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలన్నీ అసత్యాలని, రైతులకు ఎంతమాత్రమూ గిట్టుబాటు ధర లభించడం లేదని దుయ్యబట్టిన ఆయన, రైతులకు నష్టం కలిగించే ఏ చర్యలనైనా తాము ఉపేక్షించబోమని వివరించారు. 2014తో పోలిస్తే పొగాకు ధర కిలోకు 20 రూపాయల నుంచి 30 రూపాయలు తగ్గిందని గుర్తు చేసిన ఆయన రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దీక్షలకు మద్దతిస్తామని తెలిపారు.