: ఇండియా, పాకిస్థాన్ ల మధ్య కొత్త వార్... 'హ్యాకాథాన్' షురూ!

ఒకవైపు సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంటే, దాన్ని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంటున్న వేళ, మరో తరహా పోరు మొదలైంది. అదే వెబ్ సైట్ల హ్యాకింగ్. దీన్నే 'హ్యాకాథాన్' అని కూడా పిలుస్తున్నారు. గత శనివారం నాడు కేరళ అధికార వెబ్ సైటులోకి పాకిస్థాన్ హ్యాకర్లు ప్రవేశించిన సంగతి తెలిసిందే. పాక్ కు చెందిన 'ఫైజల్ 1337' అనే హ్యాకింగ్ బృందం ఈ పని చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల తరువాత భారత హ్యాకర్లు తమ సమాధానాన్ని గట్టిగానే చెప్పారు. దాదాపు 50 పాకిస్థాన్ వెబ్ సైట్లను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. "ది మల్లు సైబర్ సోల్జర్స్" పేరిట నడుస్తున్న ఓ హ్యాకర్స్ గ్రూప్ ఈ పని చేసింది. టెక్నాలజీలో, అందునా హ్యాకింగ్ రంగంలో పాకిస్థాన్ పసిబిడ్డని, ఇకపై భారత వెబ్ సైట్లను తాకే ధైర్యం కూడా చేయకుండా చేస్తామని, ఇది కేరళ ప్రభుత్వం నుంచి పాక్ కు పంపుతున్న ఓ చిన్న బహుమతని ఈ గ్రూప్ ప్రకటించింది. వివిధ పాక్ ప్రభుత్వ విభాగాలకు చెందిన 46 వెబ్ సైట్లను పూర్తిగా నాశనం చేసిన ఈ గ్రూప్, మరో 4 విద్యా వెబ్ సైట్లలోకీ ప్రవేశించింది. ది మల్లు సైబర్ సోల్జర్స్ హ్యాక్ చేసిన సైట్లలో పాక్ అధికారిక వెబ్ సైటుతో పాటు అధ్యక్షుడు, రైల్వేస్, క్యాబినెట్, కల్చరల్ విభాగం తదితరాలు నిర్వహిస్తున్న వెబ్ సైట్లన్నీ ఆగిపోయాయి. కాగా, పాక్ హ్యాకింగ్ చేసిన కేరళ సైటు కొన్ని గంటల్లోనే తిరిగి పనిచేయగా, కేరళ హ్యాకర్లు చేతికి వచ్చిన వెబ్ సైట్లలో ఏ ఒక్కటీ ఇంకా తిరిగి తెరచుకోలేదు.

More Telugu News