: త్వరలో పాత చంద్రబాబును చూస్తారు... ఉద్యోగులకు ఏపీ సీఎం హెచ్చరిక
‘‘పనిచేసే వారే నా దగ్గర ఉంటారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు’’ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సిందేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను 24 గంటలు కష్టపడుతున్నా, అధికారుల నుంచి ఆ స్థాయి సహకారం అందడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరులో ఇదే ధోరణి కొనసాగితే, మరో 3 నెలల్లో పాత చంద్రబాబును చూస్తారంటూ ఆయన హెచ్చరించారు. నిన్న విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన గుంటూరు ఆసుపత్రి ఘటన, ఇంజక్షన్ల సైకోపై కాస్త ఘాటుగా స్పందించారు. ‘‘గతంలో మాదిరిగా కాకుండా ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నా. అయితే, నేను ఎంత కష్టపడుతున్నా, ఉద్యోగుల నుంచి మాత్రం ఆ స్థాయి కృషి జరగడం లేదు. ఉద్యోగులు నిర్లిప్తంగా ఉన్నా, నిరక్ష్యంగా వ్యవహరించినా గతంలో సహించేవాడిని కాదు. కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మొద్దు నిద్రను వదిలించేందుకు సన్నద్ధంగా ఉన్నాను. ఉద్యోగుల విషయంలో మరో 3 నెలల్లో పాత చంద్రబాబు ఫెర్ ఫార్మెన్స్ చూస్తారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.