: ఫ్యాన్స్ కు అభివాదం చేస్తున్న బోల్ట్ ను కిందపడేసిన కెమెరామన్
బీజింగ్ లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కిందపడిపోవడానికి ఓ కెమెరామన్ కారణమయ్యాడు. 200 మీ ఫైనల్లో విజేతగా నిలిచిన బోల్ట్ రేసు ముగిశాక ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ముందుకెళుతున్నాడు. వెనుకగా సదరు కెమెరామన్ ఓ సెగ్ వేపై వస్తూ బోల్ట్ ను చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో అతడి సెగ్ వే చక్రాలు ఓ మెటల్ రెయిలింగ్ ను ఢీకొన్నాయి. దాంతో, సెగ్ వే అదుపుతప్పవడం, బోల్ట్ ను వెనుక నుంచి ఢీకొట్టడం జరిగిపోయాయి. ఆ కెమెరామన్ తో పాటు బోల్ట్ కూడా కిందపడిపోయాడు. స్టేడియం సిబ్బంది వచ్చి బోల్ట్ కు చేయందించగా, ముఖంపై చిరునవ్వులు పూయిస్తూ పైకి లేచాడు.