: షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాదు చేరుకున్న పవన్ కల్యాణ్... రేపు నవ్యాంధ్ర వెళ్లే విషయంపై మంతనాలు

నవ్యాంధ్ర రాజధాని కోసం ఏపీ సర్కారు నిన్న జారీ చేసిన భూసేకణ చట్టం నోటిఫికేషన్ ను జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం పేరిట రైతుల వద్ద భూములను లాక్కుంటే సహించబోనని గతంలో ప్రకటించిన పవన్ కల్యాణ్, భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ఆందోళనకు దిగుతానని ఇటీవల తేల్చిచెప్పారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అంత పట్టించుకోని ఏపీ ప్రభుత్వం నిన్న ఉదయం ఐదు గ్రామాల పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సీరియస్ గా పరిగణించిన పవన్ కల్యాణ్ తన షూటింగ్ ను అర్థాంతరంగా ముగించుకుని కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు. రేపు నోటిఫికేషన్ జారీ అయిన గ్రామాల్లో పర్యటించాలని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయంపై ఆయన తన సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో నవ్యాంధ్ర రాజధానిలో రేపు పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

More Telugu News